ఆ ఎరుకే ఆధ్యాత్మికత!…జిడ్డు కృష్ణమూర్తి
లౌకికం, ఆధ్యాత్మికం అని జీవితాన్ని రెండుగా విభజించి చూస్తుంటాం. మన
ఆలోచనలు, ఉద్వేగాలు- వాటికి మనం ప్రతిస్పందించే తీరు, ఇతరులతో సంబంధ
బాంధవ్యాలు - ఇదంతా సాధారణ జీవితం. అలవాటుగా జరిగిపోయే వాటి గురించి
అంతగా పట్టించుకోము. మరోవైపు- దైవారాధన, తీర్ధయాత్రలు, ధార్మిక ప్రవచనాలను
వినడం, మత గ్రంథాలను చదవడం- ఇవన్నీ చాలా జాగ్రత్తగా, భక్తితో చేయాల్సినవని
భావిస్తాం. వాస్తవానికి, ప్రాపంచిక జీవితంలో అంతా మంచి జరగాలనే ఆధ్యాత్మిక
విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. మరి ఆ ఫలితం దైనందిన జీవితంలో
కనిపిస్తోందా? మన బాధలకు కారణమైన అసూయా ద్వేషాలు, కోపతాపాలు,
భయాలు, కోరికలు, దుఃఖం, ఇతర సంఘర్షణలను దూరం చేసుకోగలుగుతున్నామా?
కనీసం తగ్గించుకోగలుగుతున్నామా? లేదు కదా! దీనికి పరిష్కారం ఎక్కడుంది?
ప్రయోగశాలలో జరిగే ప్రతి ప్రయోగానికీ ఒక ఫలితం ఉంటుంది. ఆ అనుభవసారమే క్రమంగా శాస్త్రీయజ్ఞానంగా మారుతుంది. అలాగే లౌకిక జీవితంలో జరిగే అతిసాధారణ
ఘటననూ ఒక ప్రయోగ అవకాశంగా చూడవచ్చు. ఆ నిశిత పరిశీలన నుంచే
ఆధ్యాత్మిక వివేకం జనిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఒక సంఘటన జరగ్గానే దానిపట్ల
తక్షణ అభిప్రాయం, తీర్పూ లేకుండా మన ప్రతిస్పందనల విషయంలో
విషయంలో గాఢమైన ఎరుక(ఎవేర్నెస్)తో ఉండగలగడమే చాలా కీలకం.
అలాంటి 'స్వీయ ఎరుకే అంతిమ జ్ఞానోదయానికి మొదటి మెట్టు- అంటారు
జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్వికులు. ఆధునిక వ్యక్తిత్వ వికాస గ్రంథాల నుంచి
ప్రాచీన ఆధ్యాత్మిక చింతన వరకూ అన్నింట్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమిదే! దీన్ని
ఆచరణలో పెట్టడమే మనం చేయాల్సింది.
ఉదాహరణకు ఎవరో మనల్ని తిట్టారు. దానికి వెంటనే బాధపడటమో, లేదా కోపంతో మళ్లీ
తిట్టడమో, కొట్టడమో. ఇలా ఏదో ఒకటి చేస్తాం. కోపం వల్ల గొడవ మరింత పెద్దదవుతుంది.
ఒకవేళ 'కోపం మంచిది కాదు' అని తమాయించుకున్నా, మనలోని ఆగ్రహంపూర్తిగా తొలగిపోదు.
దీనికి భిన్నంగా కోపం కలిగిన వెంటనే అందులో కొట్టుకుపోకుండా-
ఒక థర్డ్ పార్టీలా ఆ ఆవేశం అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి గమనిస్తే దాని తీరుతెన్నులు అర్ధమవుతాయి. అప్పుడు కోపం దానంతటదే మాయమవుతుంది. అంటే, అనాలోచిత
'ప్రతిక్రియ' స్థానంలో ఎరుకతో కూడిన ప్రతిస్పందన' చోటు చేసుకుందన్నమాట.
ఇలా లౌకిక వ్యవహారాల్లో ఎరుకను జోడించడమే అసలైన ఆధ్యాత్మిక సాధన.
జీవితంలో ప్రశాంతతకూ, ఆనందానికీ అదే సిసలైన మార్గం. దీన్ని వదిలేసి ఇంకేం చేసినా
అది కేవలం కాలక్షేపమే అవుతుంది. మన అంతర్గత భయాలు, కోరికలు, నమ్మకాల తాలూకు
బాహ్య వ్యక్తీకరణగానే అంతా మిగులుతుంది. దీనికి భిన్నంగా- నిత్య జీవితంలో
ప్రతి సందర్భంలోనూ ఎరుకతో ప్రవర్తించగలిగితే అదే నిజమైన పరివర్తన అని తెలుస్తుంది.
అదే నిజమైన ధ్యానం. అలాంటి నిరంతర ఎరుకలోనే అలౌకిక ఏకాంతం,
నిజమైన ప్రేమ, కరుణలు జనిస్తాయి. ఆ వెలుగులో లౌకికం ఆధ్యాత్మికం అనే విభజన
చెరిగిపోతుంది. సమస్త దుఃఖాలూ అంతమై జీవితమే ధ్యానంగా ప్రకాశిస్తుంది.
ఈదర రవికిరణ్
నమస్తే తెలంగాణ ఏప్రిల్ మూడు 2025 విధ్వంసకాండపై మౌనమా? …బుద్దామురళి రాజధాని నగర శివారుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విల్లాలు కనిపిస్తున్నాయి. అవి ఒకప్పుడు పచ్చని పొలాలతో అలరారిన గ్రామాలు. పచ్చదనం అలానే ఉంది కానీ, అవి పేదలు, రైతులు నివసిస్తున్న గ్రామాలు కాదు. సంపన్నులు, ఎగువ, మధ్య తరగతి వాళ్లు హైదరాబాద్ మహా నగరంలోని కాలుష్యంలో నివసించలేక నగరానికి దూరంగా విల్లాల్లో నివసిస్తున్నారు. అది మంచి గాలి కోసం కావొచ్చు. నగరంలో నివసించలేని పరిస్థితులు ఉండటమూ కావొచ్చు. ఒకప్పుడు బతుకుదెరువు లేక గ్రామాలను వీడి నగరానికి వచ్చేవారు. ఇప్పుడు నగరంలో కాలుష్య గాలిని పీల్చలేక నగరాన్ని వీడి గ్రామాలకు వెళ్తున్నారు. హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు చల్లగా అద్భుతంగా ఉండేది. జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తుంటే నిద్రపోయినవారు కూడా చల్లని గాలి సోకగానే హైదరాబాద్ శివారులకు వచ్చా మనుకునేవారు. సికింద్రాబాద్ కింగ్స్ దారిలో బాల్యం గడిచింది. రోడ్డుకిరువైపులా చెట్లు చల్లని గాలి అనుభూతి ఇప్పటికీ గుర్తుంది. క్రమంగా హైదరాబాద్ కాంక్రీట్ జనారణ్యంగా మారింది. నగరం అన్నాక అభివృద్ధి చెందుతుంది. కానీ, గాలి కూడా దొరకకుండా చేయడం అభివృద్ధి కాదు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా సచివాలయంలో ఉద్యోగులు సభ నిర్వహిస్తారు. సీఎంకు స్వాగతం పలుకుతారు. ఉద్యమంద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణ కావడంతో ఆ రోజు అక్కడి వాతావరణం చాలా ఉత్సాహంగాఉంది. ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించడానికి కేసీఆర్ సిద్ధమైన అక్కడ ఎండ, ఉక్కపోత వల్ల ఎక్కువసేపు మాట్లాడలేదు. ఇది హైదరాబాద్ వాతావరణంకాదు. ఎంత చల్లగా ఉండేది అంటూ వాతావరణం గురించి చెప్పుకొచ్చారు. బహుశా అప్పుడే హరితహారం గురించి ఆలోచన చేసి ఉంటారు. ఆ తర్వాత తెలంగాణలో ఒక ఉద్యమంలా హరితహారం చేపట్టారు. ఏ రాశి వారు ఏ మొక్కలు నాటితే బాగుంటుందో కేసీఆర్ సూచిస్తే మేధావులు, మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇదేం మూఢనమ్మకం అని. పలానా రాశివారు పలానా మొక్కలు మాత్రమే నాటాలనేది చట్టం కాదు. వేరే మొక్క నాటితే శిక్షలు వేయడం కాదు. హరితహారం వంటి మీడియాకు ఆసక్తి ఉండని అంశంపై కూడా ఆసక్తి కలిగించి. ఏదోరకంగా ప్రచారం లభించి పెద్ద ఎత్తున ప్రజలు మొక్కలు నాటాలనేది కేసీఆర్ ఉద్దేశం. కానీ మేధావులకు, మీడియాకు ఇందులో ప్రయోజనం కన్నామూఢ నమ్మకమే ఎక్కువ కనిపించింది. మీ రాశుల ప్రకారం మొక్కలు నాటండి.అంటే అలా ఎలా అంటారని తమ మీడియాలో చర్చలు నిర్వహించినవారికి, మేధావులకు ఇప్పుడు హెచ్ సీ యూలోని నాలుగువందల ఎకరాల్లో వేలాది చెట్లను వందలాది బుల్డోజర్లతో కూలుస్తుంటే కనిపించడం లేదు. నెమళ్ల ఏడుపులు వినిపించడం లేదు. సీఎంకు అక్కడ గుంటనక్కలు కనిపించాయి. విద్యార్థులు ఔను మేం గుంటనక్కలమే అని భారీ ప్రదర్శన నిర్వహించారు. పోరాట స్ఫూర్తి చనిపోలేదని విద్యార్థులు నిరూపిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని బిజినెస్ స్టాండర్డ్ వంటి జాతీయ మీడియా పట్టించుకున్నా.. స్థానిక మీడియా అంతగా చొరవ చూపడం లేదు. రికార్డ్ కోసం ఉద్యమాన్ని కవర్ చేయడం వేరు. జరుగుతున్నది అన్యాయమని భావిస్తే ఉద్యమానికి అనుకూలంగా చొరవ చూపడం వేరు. సామాజిక మాధ్యమాల పుణ్యమాని విద్యార్థుల వాయిస్ వినిపిస్తున్నది. లేకపోతే సంప్రదాయ మీడియానే ఉండి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించవచ్చు. ఏపీలో ఏవో కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తే, ఉద్యమాన్ని మీడియా తన భుజాన మోసింది. 200 దేశాల్లో బాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారని అదరగొట్టింది. కానీ, హైదరాబాద్లో జరుగుతున్న విధ్యంసంపై మాత్రం మీడియా సమాచారాన్ని రికార్డ్ చేయడం వరకే పరిమితమవుతుంది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చి రోడ్డునపడేసినా, సెంట్రల్ యూనివర్సిటీలో నెమళ్లు, జింకలను చెల్లాచెదురు చేసి, వేలాది చెట్లను కూల్చి, నాలుగు వందల ఎకరాలను ఎవరికో ధారాదత్తం చేయాలని చూస్తున్నా... మీడియా స్పందన అంతంత మాత్రమే.రికార్డ్ కోసం వార్త రాయడం వేరుగా ఉంటుంది. అన్యాయాన్ని అన్యాయం అని ప్రశ్నించడం వేరుగా ఉంటుంది. మీడియా ఇప్పుడు రికార్డ్ మాత్రమే చేస్తున్నది. యూనివర్సిటీలోకి ఎవరినీ అనుమతించకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో పని కానిస్తున్నారు. బుల్డోజర్ల విధ్వంసంతో నెమళ్లు, జింకలు పరిగెత్తుతూ చేస్తున్న ఆర్తనాదాల వీడియో వింటే మనసు చలిస్తుంది. వాటి ఏడుపునకు శక్తి ఉంటే బాగుండు, వాటి ఉసురు తగిలితే బాగుండనిపించింది. ఆ వీడియోలు, అడవి జంతువుల హాహాకారాలు మీడియా చిత్రీకరించలేదు. అక్కడి విద్యార్థులు రహస్యంగా తమ కెమెరాల్లో బంధించడంతో సామాజిక మాధ్యమాలద్వారా బయటకు వచ్చాయి. అంతే కానీ మీడియాద్వారా కాదు. అనేక కారణాల వల్ల రేవంత్రెడ్డి ప్రభుత్వానికి మీడియాల యాజమాన్యం పూర్తి మద్దతు లభిస్తున్నది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారివి. అయితే, 'మేం రాయకపోతే, మేం చూపకపోతే ప్రజలకు తెలియదనుకునే రోజులుకావు. సామాజిక మాధ్యమాల కాలం ఇది. ప్రధాన మీడియాను మించి సామాజిక మాధ్యమాల వల్ల క్షణాల్లో ప్రజలకు సమాచారం అందుతున్న రోజులివి. ప్రజల కోసం కాకపోయినా, తమ ఉనికి తాము కాపాడుకోవడానికి, విశ్వసనీయత నిలుపుకోవడానికైనా ఇలాంటి విధ్వంసాలపై మీడియా అనివార్యంగా స్పందించాల్సిన సమయం. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం మనకెందుకు అనుకుంటే రేపు ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ భూములపై కన్ను వేయవచ్చు, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ భూములపైకన్ను వేయవచ్చు. నాదెండ్ల భాస్కరరావు నెలరోజులు సీఎంగా ఉన్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ స్థలాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నెల రోజులకే దిగిపోవడం వల్ల పార్క్బతికి బట్ట కట్టింది. నెల రోజులు కాదు, ఇప్పుడు కాంగ్రెస్కు ఇంకా మూడున్నరేండ్ల గడువున్నది. మౌనంగా ఉంటే అన్నీఅమ్ముకోవడానికి అవసరమైనంత సమయం ఉన్నది. ప్రభుత్వం తాము చేస్తున్నది చట్టబద్ధం అనుకున్నప్పుడు దొంగచాటుగా, అర్ధరాత్రి, సెలవు రోజుల్లో ఎందుకుచేయాలి. కోర్టులు పనిచేస్తున్నప్పుడే బుల్డోజర్లు పంపవచ్చు కదా?
అనాథల.. ఆశాజ్యోతి……యశోద చారిటబుల్ ఫౌండేషన్
*అనాథ యువతకు వెలుగు దారి చూపుతున్న వేదిక
*ఒంటరి జీవితాల్లో విశ్వాసం నింపుతున్న యశోద గ్రూప్ సీఎండీ
*వృత్తి విద్యలో శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రవీందర్ రావు
కష్టసుఖాలు తెలిసిన వారే.. ఇతరుల కష్టాలను అర్థం చేసుకుంటారనేందుకు యశోద గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రవీందర్ రావే నిదర్శనం. 'సొంత లాభం కొంత మాని... పొరుగు వారికి తోడ్పడవోయ్' అన్న గురజాడ సూక్తిని అక్షరాలా
ఆచరిస్తున్న వ్యక్తి ఆయన. యశోద చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించి అనాథ యువతకు వృత్తి శిక్షణ అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి యువతను ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్న రవీందర్ రావు కృషి ఎందరెందరికో
స్ఫూర్తిదాయకం. అనాథ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న యశోద చారిటబుల్ ఫౌండేషన్ విశేషాలు మీకోసం...
*జీవితంలో లక్ష్యం సాధించాలన్న దృఢ సంకల్పం అవసరం. తల్లిదండ్రులు, కుటుంబానికి దూరంగా బతికే మనో ప్రపంచం అత్యంత భయానకంగా ఉంటుంది. జీవితం ఆగమ్యగోచరంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న సమాజంపై కొన్నిసార్లు కోసం వస్తుంది. ఒంటరితనంలోంచి వివేచన కోల్పోయే స్థితికి చేరుకుంటారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపితే.. సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలాంటి కర్తవ్యాన్ని భుజానికెత్తుకుంది యశోద, చారిటబుల్ ఫౌండేషన్, ఆనాధ పిల్లలకు ఉపాధి కల్పించి.. వాళ్లు జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించే ఉద్దేశంతో రవీందర్ రావు 2011లో ఈ ఫౌండేషన్ను స్థాపించారు. ఇప్పటి వరకు వేలాది మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి
అవకాశం కల్పించిన ఈ ఫౌండేషన్ సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.
ఆర్థిక స్వావలంబన ....
ఇక్కడ శిక్షణ పొందిన వారు ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా ఇతరులపై ఆధారపడకుండా ఆర్ధిక స్వావలంబన సాధిస్తున్నారు. అంతేకాదు.. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలను అధిగమింరేందుకు కు అవసరమైన కౌన్సెలింగ్ అందిస్తోందీ సంస్థ. ఇప్పటి వరకు 2108 మంది విద్యార్థులు ఈ ఫౌండేషన్లో శిక్షణ పొందగా, 1882 మంది ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం 146 మంది శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులకు ఇంగ్లీషు ను బోధిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తోందీ సంస్థ
ఆత్మవిశ్వాసం నింపుతాం
అనాథ పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపి, స్వావలంబన దిశగా వారిని నడిపించేందుకే ఈ సంస్థను ప్రారంభించాం. పదో తరగతి పూర్తి చేసిన 16 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉన్న అనాధ యువతకు 65 రోజులపాటు ఉపాధి అనుబంధ శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచిత భోజనం, వసతి, ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నాం. శిక్షణ పొందిన వారికి ఆస్పత్రులు, బీపీఓ, ఎంయెన్సీ కంపెనీల్లో ఒప్పందాలు కుదుర్చుకుని ఉపాధి కల్పిస్తున్నాం. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. నైరాశ్యంలో ఉన్న అనాధలను ఆత్మ విశ్వాసంతో తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా తీర్చిదిద్దుతున్నాం. సమస్యలను అధిగమించేందుకు అవసరమైన సామకూల దృక్పధాన్ని అందించేందుకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నట్లు 'యశోద' గ్రూప్సీఎండీ రవీందర్ రావు వివరించారు.
ట్యూటర్ల నియామకం
అనాధశ్రయాల్లో ఉంటూ పాఠశాల విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్లను నియమిస్తున్నారు. 8,9,10వ తరగతి విద్యార్థులు గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి క్లిష్టమైన సబ్జెక్టుల్లో మంచి నైపుణ్యం పొందడానికి ట్యూటర్లు దోహదపడుతున్నారు.
10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వృత్తి విద్యా కోర్సు అభ్యసించేందుకు ఫౌండేషన్ సహకరిస్తోంది. డీఎంఎల్, ఎంపీహెచ్ డబ్ల్యూ, ఈసీజీ టెక్నీషియన్స్, సీఎస్ఏతోపాటు ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, డ్రైవింగ్, కార్పెంటర్ వృత్తుల్లో ఆసక్తిని బట్టి శిక్షణ అందిస్తున్నామని సంస్థ ఛైర్మన్ రవీందర్ రావు తెలిపారు ఎవరైనా వివరాలు కావాలనుకుంటే https://yashodafoundation.org/ లో సంప్రదించాలన్నారు.
ధైర్యం వచ్చింది; మాది అంబర్పేట్, ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఇక్కడికి వచ్చాక ఎవరిపై ఆధారపడకుండా నా కాళ్లపై నేను నిలబడగలనన్న ధైర్యాన్ని కూడగట్టుకోగలిగాను. జీవితంలో ఎదగడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ఇక్కడ సమాజంలో ఎవరితో ఎలా మెలగాలో నేర్పించారు. మంచి ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. - పి.మాధురి
బాధలన్నీ మర్చిపోయా; మాది వైజాగ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మా అత్తయ్యవాళ్ల వద్ద పెరిగాను, అమన్ వేదిక సంస్ధ ద్వారా నేను ఈ ఫౌండేషన్లో చేరాను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక్కడికి వచ్చాక అవన్నీ మర్చిపోయాను. మంచి ఉద్యోగం సంపాదించగలన్న ఆత్మవిశ్వాసం వచ్చింది భవిష్యత్లో మంచి ఉద్యోగం సాధించి అనాథలకు సేవ చేస్తా.- పి.సుశాంతి
ఆత్మవిశ్వాసం పెరిగింది; మాది న్యూ బోయిగూడ, చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. మా.
అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచింది మా అమ్మ ఇళ్లలో పని చేస్తేనే పూట గడుస్తోంది. అందుకే అమ్మకు సహాయంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నేను కూడా పని చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. షాదాన్ కళాశాలలో బీఎస్సీ (నర్సింగ్)లో సీట్ వచ్చింది. కోర్సు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధిస్తానన్న విశ్వాసం.
వచ్చింది. -జహంగీర్ బీ
నేనూ ఫౌండేషన్ స్థాపిస్తా; మాది శ్రీకాకుళం నాకు అమ్మానాన్న లేరు యశోద చారిటబుల్ ఫౌండేషన్లో శిక్షణ పొందాక నాకు మంచి నమ్మకం కలిగింది నేను కూడా భవిష్యత్తులో ఇలాంటి ఫౌండేషన్ ను స్థాపించి నాలాంటి ఆనాధలకు సహాయం చేస్తా. - శ్రీను
మార్పు వచ్చింది; అమ్మానాన్న చనిపోయాక పిన్ని దగ్గర పెరిగాను. పట్నంలో ఏదో పనిచేసుకొని బతకాలని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భగవంత్ అన్నయ్య కలిశారు తను నన్ను బీసీ హాస్టల్లో చేర్పించారు అక్కడి నుంచి ఫౌండేషన్కి వచ్చాను. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్నా. గతంలోలా ఇప్పుడు నాలో సంశయాలు లేవు. ప్రతి విషయంపై పాజిటివ్ గా ఆలోచిస్తున్నా.-ఎ.అఖిల్ చంద్ర
ఉచిత శిక్షణ అంటే నమ్మలేదు.; మాది దిల్ సుఖ్ నగర్ నాన్న చనిపోయాక అమ్మ కష్టపడి పెంచింది. ఇక్కడ ఉచితంగా భోజనం, వసతి కల్పించి శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తారంటే మొదట్లో నమ్మలేదు కానీ ఇక్కడికి వచ్చాక ఏన్నో కొత్త
విషయాలు తెలుసుకున్నాను ఏదైనా సాధించగలమన్న విశ్వాసం పెరిగింది మంచి ఉద్యోగం సాధించి నాలాంటి వారికి సహాయం అందిస్తాను. -ఎం.మాధవి
సంప్రదించండి: yashodafoundation.org ఫోన్ : 040-47766675 ; 9963404620
(3) జో జో నందనందనా!
భక్తిలో ఎంత పిచ్చి ఉందో, అది పడితే గాని అర్థం కాదు. పెద్దగా ప్రయత్నం లేకుండానే బాల్యంలోనే నాలో మొగ్గ తొడిగిన భక్తి నన్ను ఏదో ఏదో చేసింది. రాత్రి పూట నిద్ర పట్టేది కాదు. మరీ చిన్నతనంలో మా నానమ్మ ప్రక్కన పడుకొని నిద్ర పోయేవాణ్ణి. ఆ తరువాత హైస్కూలులో చదువు. రాత్రిపూట చదువుకొని ఒంటరిగా పడుకొనేవాణ్ణి. భగవంతుణ్ణి గూర్చిన ఆలోచనలే మనస్సులో కదుల్తూ ఉండేవి. నిద్ర పట్టేది కాదు. నా దగ్గర దాచి పెట్టిన డబ్బులతో కొనుక్కున్న ఒక చిన్న కృష్ణుడి బొమ్మ ఉండేది. అది నాకు చాలా ప్రియమైన మూర్తి. ఒక విధంగా ఆ రోజుల్లో నా ప్రాణం
అదే నేమో!
మా ఇంటికి సమీపంలో ఒక ముస్లిం టైలర్ ఉండేవాడు. అతడు కటింగ్ చేసే చోట చిన్న చిన్న వస్త్ర ఖండాలు క్రొత్తవి పడి ఉండేవి. నేను వాటిని ఏరుకొని, ఒక చిన్న పరుపుకు, చిన్న దిండుకు సరిపడేటంతగా ఆ గుడ్డల్ని ప్రోగు చేసుకొని, టైలర్ కిచ్చి ఒక చిన్ని పరుపు, చిన్ని దిండు కుట్టివ్వమని అర్థించాను. ఎందుకు అని అడిగాడు టైలర్. నా ప్రక్కన నా కృష్ణుడు పడుకుంటాడు. ఆయన కూడా నా లాగే చాప మీద పడుకుంటున్నాడు అని వెక్కి వెక్కి ఏడ్చాను. అతడు నన్ను ఓదార్చాడు. ఏవో కొన్ని ముస్లిం సూక్తులు, అవీ ఇవీ చెప్పి నన్ను ఊరడించాడు. 'నాయనా! నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు' అని ఆశీర్వదించాడు. చిన్ని పరుపు, దిండు కుట్టి ఇచ్చాడు. బహుశ
పరుపు ఆరు అంగుళాలు, దిండు రెండు అంగుళాలు ఉండొచ్చు. అది తీసుకొని, ఆయన పాదాలకు నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేశాను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. ఇతరులు ఒక ప్రక్క జాగరణ చేస్తున్నా, నేను కృష్ణుణ్ణి ప్రక్కన పండబెట్టుకొని ఆదమరచి నిద్రించిన వైకుంఠ రాత్రి.
చాలా కాలం అలాగే సాగింది. రాత్రి పూట కృష్ణుని మీద చేయి వేసుకొని ఏవేవో చెప్పుకోవడం నాకు అలవాటుగా మారింది. 'కృష్ణా! ఈ రోజు ఎవరెవరిని రక్షించావు? ఎక్కడెక్కడ తిరిగావు? అలసిపోయావా? కాళ్ళు నొచ్చుతున్నాయా? నేను మెల్లగా సేవ చేయనా?' అంటూ కృష్ణుని పాదాలను ఒత్తుతూ, అలాగే నిద్రపోయేవాణ్ణి. ఆ స్మృతులు నాలో ఇప్పటికీ పచ్చగానే ఉన్నాయి. వాటిని తలచుకొంటూ వ్రాసిందే ఈ పాట.
జో జో నందనందనా ! జో జో నందనందనా ! జో జో
చిలిపి చేతల చందురుడా ముసి ముసి నవ్వుల వాడా! జో జో
1.అలసితి వేమో ఇల పాలించి. సొలసితి వేమో భక్తుల గాచి
ఆశ్రితుల బరువులు మోసి అవనికి భారము దించి బడలిక చెందితి వేమో!
2. అందరి చూపులు నీ మీదే వారందరి పనులు నీ ముందే రేయనక పగలనక
అందరి పనులు చేసి శ్రమ పడిపోతివా స్వామి
3. చూడలేను నీ అలత అదియే నిరతము నా కలత చీకటి పడిన కాలమైనా
కనుల నిదుర కరువేనా? ఇంతేనా బ్రతుకంతా!
4.ఎక్కడెక్కడ తిరిగితివో పాదము లెంతగ నొచ్చినవో
చల్లని పదముల మెల్లగ నొత్తుచు నేనూ వాలెద స్వామి
నిదురింతుము ఇక స్వామి
అమ్మ నాన్నల ఇల్లు తల్లిదండ్రులు ఉండే ఇల్లు
ప్రపంచములో.... ఆహ్వానం లేకుండా.... మనం... ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు
"అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు ఈ ఒకే ఇల్లు ఒక్కటే... స్వతంత్రముగా.... మనమే తాళం తీసికొని.... నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు ఈ ఇల్లు.... ఒక్కటే.... ప్రేమతో నిండిన కళ్లతో...., మీరు కనిపించే వరకు.... మీ కోసం.... తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది. మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం.... మరచి పోకుండా... గుర్తు చేసే ఇల్లు. ఈ ఇంట్లో మాత్రమే.... మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ.... ఉండటం.... ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం... వెంటనే లభించే పూజ ఫలితం. మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే.... ఆ ఇంటి యజమానుల అమ్మ నాన్నలు మనస్సులు.... కృశించి.... గుండెలు.... గూడలుగా మారతాయి. మీరు నొప్పించినా.... వాళ్లు బాధపడతారు. ఈ ఇల్లు.... ప్రపంచాన్ని చూడటానికి...., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి... దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన ఇల్లు. ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది... మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు.... స్థలమే లేనిది. ఇక్కడ మాత్రమే... మీరు భోజన సమయానికి తినకపోతే.... ఆ ఇంటి యజమానుల గుండెలు
విరి గిపోతాయి మరియు బాధపడతాయి. ఈ ఇంట్లోనే.... మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి. కారణాలు ఏవయినా కావొచ్చు.... ఈ ఇళ్లకు దూరమవుతున్నా.... పిల్లల్లారా .... ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి.... ఆలస్యం కాకముందే... తల్లిదండ్రులతో గడుపుతూ.... మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ... అందుబాటులో ఉండే ఆవకాశం ఉన్నవారు అదృష్టవంతులు... ధన్యులు ఓమ్ నమస్తే
చైతన్య గీతికలు - నవ్విన పువ్వులు
-స్వామి సుందర చైతన్యానంద
మధురమైన భావాలను
సుమధురమైన పదజాలంలో తురిమి
మృదుమధురమైన కవితా పల్లకీలో కూర్చోబెట్టి
ఊరేగించేదే కవిత్వమైతే,
దానికి ముందు మాట రాసేందుకు
కవిగా నేను ముందుకు రాలేను.
మీ ముందుకు రాలేను.
కవిత్వ మనేది కేవలం సమదర్శనమే నని
కవి ఏనాడైనా క్రాంతదర్శియే నని
నిజాలను ప్రదర్శించే యత్నంలో
ఋజువులను సృష్టించే ప్రయత్నంలో
యోజనాలను దూరాలుగా, భారాలుగా భావించక
ప్రయోజనాలనే భవ్యంగా, భావ్యంగా తలచి
జననాడిని కుదిపి
జీవనాడిని తెలిసి
జీవన స్రవంతి నిరాటంకంగా సాగేందుకు
అవరోధాలను తొలగించి
రేపటి ఆశకు తెరదించి
నిన్నటి నిరాశకు సమాధి కట్టి
నేటిని మేటిగా నిలిపేందుకు
సర్వాన్ని సర్వంలో కలిపేందుకు -
కవిత్వమొక సాధనమైతే,
కవిగా నేను సాధకుణ్ణి.
సాధ్యాన్ని కూడా.
అవలోకించే వారికి సుందర వనాన్ని
అండ చేరే వారికి చైతన్య నిలయాన్ని
ఆస్వాదించే వారికి ఆనందాలయాన్ని.
ఈ వనంలో
విరబూసిన వేదాంత సుమాలే చైతన్య స్వరాలు
ఈ నిలయంలో
విరజిమ్మిన విజ్ఞాన సౌరభాలే చైతన్య రాగాలు
ఈ ఆలయంలో
విరివిగ వితరణ చేయబడిన ప్రసాదాలే
చైతన్య గానాలు.ఈ పాటల్లో,
మంచి చెడుల మర్మాలున్నాయి.
ధర్మాధర్మాల సందడు లున్నాయి.
వివేకాన్ని పంచే అంగడు లున్నాయి.
పూజించేందుకు గుడు లెన్నో ఉన్నాయి.
వెల కట్టేందుకు యతిప్రాస లున్నాయి.
వెల కట్ట లేని యతి శ్వాస లున్నాయి.
మాసిపోని మాట లున్నాయి.
హద్దులు దాటిన పదా లున్నాయి.
తెల్లని కాగితాలపై తేలియాడే ఈ నల్లని రాతలు
కాలం చెల్లే రాతలు కావు. కాలంలో
చెల్లని రాతలూ కావు.
ఇవి జ్ఞానక్షీరాన్ని అందించే మాతలు
తప్పకుండా తుడుస్తాయి మన తల రాతలు.
ఇందులో,
కవిలేడు. కవిత్వ ముంది.
గాయకుడు లేడు. గాన ముంది.
వేదాంతి లేడు. వేదాంత ముంది.
కర్త లేకుండా సాగిన కర్మ ఇది. యజ్ఞమిది.
జ్ఞానయజ్ఞ మిది.
వసంతాన్ని చూచేందుకు కళ్ళు సరిపోతాయి.
అనుభవించేందుకు హృదయ ముండాలి.
సున్నితమైన ఒక హృదయం ఒలికించిన
కవితా సుధలను పట్టి నిలుపుకొనేందుకు
సరియైన పాత్ర మరొక సున్నిత హృదయమే.
హృదయేశుని రస మందిరమే.
సరసమయ నవరస మందిరమే.
సమరస మందిరమే.
స్వామి
కలలను కరిగించే
కవితా ఉషస్సులో
ప్రార్థనే ప్రాణవాయువుగా పొందిన
ఓ కిరణం
స్వామి సుందరచైతన్యానంద


