పశువులు అంటే బాపుకు ప్రాణం చిటుకుల మైసారెడ్డి 9490524724 పశువులు అంటే ఆయనకు ప్రాణం. చెట్టు, చేమ అంటే ఆయనకు శ్వాస, మట్టి తోనే అయన జీవితం. తూరుపు తెలవారుతుండగానే వేపపుల్లేసుకొని ఇంటి నుంచి ఎల్లిండంటే, పొద్దుగూకినంకనే ఇంటి ముఖం చూస్తుండే. ఊరంటే ప్రేమ. ఊరోళ్లకు ఆత్మీయుడు. ఆపదొస్తే అందరికీ అండ. ఆయనే మా బాపు చిటుకుల నర్సారెడ్డి. అందరికి ఆత్మబంధువు బర్లకాడి నర్సయ్య. ఉద్యమాల గడ్డ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి మాది. ఊర్లోని దాదాపు 200 బర్ల కాపరి, వానొచ్చినా, ఎండొచ్చినా పొద్దూక చెట్టు, పుట్ట పట్టుకొని తిరుగుతూ బర్లు కాస్తుండే. పొద్దుగూకిందంటే ఎవరి ఇంటి బర్లు వాళ్ళింటికి తోలేటోడు. బాపు ఇంటికి రాంగానే కాళ్లుచేతులు కడుక్కొని పెద్ద పీట మీద ఒరుగు తుండే. రాత్రి ఎనిమిది కాగానే, తిని పడుకునుడు. తెల్లవారుతుండగానే బర్ల మంద మఠం బలిజోల్ల చింత చెట్ల దగ్గరకు పోవు. అన్ని బర్లు రాగానే చెరువు, పేరండ్లు, పొలాల దిక్కు మేతకు తోల్కపోపు, 12 అయిందంటే మళ్ళీ బర్లన్నీ మందకు వచ్చు. అప్పటికే అమ్మ సద్ది తీసుకుని వచ్చు. సద్దితిని ఓ గంట చెట్టు దగ్గర ఒరుగుతుండె. పగలు రెండు న్నర మూడు ప్రాంతంలో మళ్లీ బర్లను మేతకు తీస్కపోవు. మంద దగ్గర బర్ల పెండను అమ్మ. నేను కుప్పేసి ఇంటికెళ్లేది. బాపు బర్లను ఊరు పొలిమేర లోట్లమర్రి, కాశిమ్ చెరువు, పెద్ద చెరువు, ఎల సముద్రం కుంట, పెద్ద మామిడి తోట దిక్కు, పెద్ద చెప్యాల, రుద్రారం వీరారెడ్డిపల్లి, గాజులపల్లి పొలిమేర దాకా తిప్పుకొంటు చీకటి పడగానే ఊర్లకుపంపు. అప్పటికే పంచాయతీ దగ్గర చౌరస్తాలో ఉన్న బర్ల యజమానులు తమ బర్లు రాగానే ఇంటికి తీసుకెల్దురు. ఇట్ల బాపు 25 యేండ్లు బర్లు కాసిండు. ఆయన కష్టం ఎవరికీ రావద్దు. పశువులను పూజించే సంస్కృతి తెలంగాణకు సంక్రాంతి పండుగ ప్రత్యేకం. పనిముట్లు, పశువులను పూజించే వ్యవసాయ సంస్కృతి, కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దులను కడిగి కొమ్ములకు నూనె రాసి ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడ్తారు. సాయంకాలం పశువుల మీద మంచి నీటిని చిలకరిస్తరు. పశులు సాయంకాలం ఇంటి వస్తే లక్ష్మి వచ్చినట్లు ఆనందపడ్డారు. ఆ రోజు పశులకు పండుగ పూట వండిన నైవేద్యం పెడ్తారు. పాకలను శుభ్రం చేసి అక్కడే భోజనం చేస్తరు. శాకాహారులైతే బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు అన్నీ ఇంటికి తీసుకువెళ్లి వండుకుంటరు. వ్యవసాయదారుడికి పశువులే ధనం. పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతగా వాటికి కొత్త బియ్యంతో పరమాన్నం వండి పెడుతరు. 40 యేండ్ల కిందట గత్తర వచ్చి జనం ఎంతో ఇబ్బందులు పడ్డారు. నీళ్లు లేక, ఎవసం నడవక, ఏదైనా పని చేసుకుందాం అంటే ఎన్నో కష్టాలు పడ్డ రోజులవి. అందులో మా బాపు జీవితం కూడా కష్టాల కడలి. ఎంత బాదొచ్చినా తన మనసులో పెట్టుకొను. పిల్లలు ఇబ్బందులు పడ్తరని మాకు చెప్పక పోవు. కరువు కాలంలో బాయిలు, సడాకులు తవ్వారు బాపు, అమ్మ, అప్పుడు మా అక్క, అన్న, నేను, చెల్లె చిన్నోళ్లం. గుత్త పట్టు కుని బావులు తొవ్విండు. ఉన్నది ఒక ఎకరం. వానలు పడ్డప్పుడు తప్పు ఎప్పుడూ పంట పండింది లేదు. కాంచెరువు (కాశీమ్ చెరువు) నిండిన్నాడు ఇంత పంట పండేది. బాయిలో నీళ్లు లేకపోవు. కాంచెరువుతో బాయిలోకి ఇంత ఊట వచ్చు. బాయిలో జెర నీళ్లు ఊరగానే బాపు, అమ్మ యాతమేసి ఎత్తి పోద్దురు. బాయిల నీళ్లు లేకపోతే బర్ల కాస్తూ ఆర్నెల్లకు ఒక్కసారి వచ్చే డబ్బులతో జీవితం నెట్టుకొచ్చేది. బాపుకు చాతకాకుంటే అమ్మ, నేను బర్లను కాస్తుంటిమి. కాట్రావుల (పశువుల పండుగ) సంక్రాంతి అంటే బాపు చేసే కాట్రావుల (పశువుల)పండుగ యాదికొస్తది. సంక్రాంతికి వారం ముందు ఈ పండుగ చేసుకుందురు. ఈ పండుగ రోజు ఇంటిలో వాళ్ళం అందరం బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులు, ఇంత మాంసాహారం తీసుకుని బాపు ఎంబడి బర్లకాడికి పొదుము. పెద్ద చెరువులోని బంకమట్టి తెచ్చి పశువుల బొమ్మలు చేద్దుము. ఓ చెట్టు కింద పందిరి వేసి మామిడి తోరణాలు, బంతి పూల దండలు కట్టి మట్టితో చేసిన పశువులను అందులో ఉంచి వాటికి బొట్టు. పసుపు నూనె రాసి.. దీపం ముట్టించి.. అమ్మ చేసిన పరమాన్నం పెడుదుము. పండుగ నాడు బాపు బర్లను, దూడలను అన్నింటినీ పెద్ద చెరువులో మంచిగా కడుగు. వాటికి బొట్లు పెట్టి కొమ్ములకు పసుపు నూనె రాసి పసుపు కుంకుమలతో అరచేతి ముద్రలు వాటిపై వేద్దుము. మామిడి తోరణాల కింది నుంచి బర్ల మందను డ్డ దాటిద్దుము. బాపు చనిపోయి 21 యేండ్లు అవుతున్నది. సంక్రాంతి వచ్చిందంటే బాపు చేసే కాట్రావుల పండుగా యాదికొస్తది. 2020 నవంబర్ లో అమ్మ కాలం చేసింది. బాపు లేనప్పుడు అమ్మతోని కల్సి సంక్రాంతి పండుగ చేసుకునేది. ఇప్పుడు బాపు. అమ్మ కూడా లేరు. ఆ వెలితి. జీవం అంత గుంజేసినట్లు ఉంది. 2023 సెప్టెంబర్ లో నా బిడ్డ పెండ్లి చేసిన, బాపు, అమ్మ ఉంటే మనవరాలి పెండ్లి చూసి ఎంతో సంతోషపడుదురు. కానీ, బాపు అమ్మ దీవెనలు నా బిడ్డకు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్ కోసం తండ్లటా. ఎవుసం పండుగజేసి తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో సంక్రాంతి సంబరంగా ఉండేది. సంక్రాంతి శోభకు మన తెలంగాణ పెద్ద బాపు కేసీఆర్ రైతుబంధు పండుగ సంబురాలు ఉండేవి. పల్లెలన్నీ పండుగ వాతావరణంలో కోలాహలంగా కనిపించేవి. దేశంలో ఇటువంటి పథకం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాల మాగాణి పచ్చని సిరుల పంటలు పండుతున్నాయి. 60 యేండ్ల ఉమ్మడి రాష్ట్రపాలనలో రైతు బతుకు ఎట్లుండే. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నరు. నాటి రైతు కాట్రావుల పండుగ గత తొమ్మిదిన్నర ఏండ్లు రైతు బంధు పండుగతో సంక్రాంతి అంబరాన్ని అంటింది. తెలంగాణ బిడ్డల బాగు కోసం నాడు కేసీఆర్ ఒక తండ్రిలాగ భవిష్యత్ కు భరోసా ఇచ్చారు. రాష్ట్రం తెచ్చిన ఉద్యమ నాయకుడే రాష్ట్ర పరిపాలకుడిగా 'బాపు'లా రాష్టాన్ని అభివృద్ధి సంక్షేమంలో ప్రగతి పథంలో ముందుకు నడిపించారు కేసీఆర్ బాపు. కేసీఆర్ బాపు నాయకత్వం లో తెలంగాణ ఎవసం పండుగలా ఉండేది. కేసీఆర్ బాపు రైతన్నకు వెన్నెముక అయి నిలిచిండు. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, సిద్దిపేట)